అమ్మా… క్యాంపస్‌లో కాల్పులు జరుగుతున్నాయి. నేను పారిపోతున్నా… ఐ లవ్యూ”
అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న కాల్పుల ఘటన సమయంలో ఓ విద్యార్థి తన తల్లికి పంపిన ఈ ఒక్క మెసేజ్ అక్కడ నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీ క్యాంపస్ యుద్ధభూమిని తలపించింది. ప్రాణభయంతో పరుగులు తీస్తున్న విద్యార్థులు, ఎక్కడ దాక్కోవాలో తెలియక వణికిపోయిన క్షణాలు అక్కడి వాతావరణాన్ని తీవ్రంగా మార్చేశాయి. చదువుల కోసం వచ్చిన విద్యార్థులే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శనివారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.05 గంటల సమయంలో నల్ల దుస్తులు ధరించిన ఓ దుండగుడు బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. నిందితుడు ఘటన తర్వాత పరారీలోకి వెళ్లడంతో యూనివర్సిటీ యాజమాన్యం వెంటనే క్యాంపస్‌ను పూర్తిగా లాక్‌డౌన్ చేసింది. విద్యార్థులు, సిబ్బందిని భవనాల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన విద్యార్థి జేడెన్ అన్సెల్మో తల్లి షమ్సా అమేర్సీ, ఆ భయానక క్షణాలను కన్నీళ్లతో వివరించారు. ప్రస్తుతం ఫైనల్ పరీక్షలు జరుగుతున్న కారణంగా విద్యార్థులంతా క్యాంపస్‌లోనే ఉన్నారని ఆమె తెలిపారు. అదే సమయంలో తన కుమారుడి నుంచి “అమ్మా… ఐ లవ్యూ” అనే మెసేజ్ రావడంతో తన గుండె గుబురుమందని చెప్పారు. కాల్పుల సమయంలో ఫోన్ శబ్దం రాకుండా చూసుకోవాలని తాను కుమారుడికి సూచించినట్లు తెలిపారు. జేడెన్ మరో 12 మంది విద్యార్థులతో కలిసి ఒక సప్లై క్లాసెట్‌లో తలదాచుకుని ప్రాణాలు కాపాడుకున్నట్లు ఆమె వెల్లడించారు.
యూనివర్సిటీలోని ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగాలు ఉన్న బారస్ అండ్ హోలీ భవనంలో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఘటన అనంతరం గంటల తరబడి పోలీసులు క్యాంపస్‌ను జల్లెడ పట్టారు. ఎఫ్‌బీఐ రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారులు పూర్తి సమాచారం అందించారు. నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడని, అతని కోసం విస్తృతంగా గాలింపు చేపట్టినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటన అమెరికాలో క్యాంపస్ భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.