ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గమనిక జారీ చేసింది. జనవరి 2026 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయడం పరిపాటి కాగా, ఈసారి జనవరి ఒకటో తేదీ ప్రభుత్వ సెలవు కావడంతో పింఛన్లను ఒకరోజు ముందుగానే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జనవరి నెల పింఛన్లు డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ మార్పుతో పింఛన్‌దారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.
డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు అదే రోజున పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సెలవులు, పబ్లిక్ హాలిడేలు ఉన్న సందర్భాల్లో గతంలోనూ ప్రభుత్వం ఇదే తరహా నిర్ణయాలు తీసుకుంది. లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా నగదు అందాలన్న ఉద్దేశంతో పరిస్థితులకు అనుగుణంగా పంపిణీ తేదీల్లో మార్పులు చేస్తూ వస్తోంది.
గతేడాది కూడా ఇదే విధంగా జనవరి నెల పింఛన్లను డిసెంబర్ 31వ తేదీన అందించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా జనవరి ఒకటో తేదీ సెలవు కావడంతో ప్రభుత్వం ముందస్తుగా పింఛన్ల పంపిణీ చేసింది. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ 2026 జనవరి పింఛన్లను ముందుగానే అందించేందుకు సిద్ధమైంది. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు, సెలవులు లేదా పరిపాలనా కారణాలు ఉన్నప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.
సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.15,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ.10,000 చొప్పున పింఛన్ అందుతోంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఈ పింఛన్లు పంపిణీ చేయగా, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోనే పంపిణీ జరుగుతోంది.