ఎకో–ఫ్రెండ్లీ వెకేషన్‌కు మొదటి అడుగు సరైన బస ఎంపిక. కోల్‌కతాలో పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో నడిచే అనేక గెస్ట్ హౌస్‌లు, హోటళ్లు ఉన్నాయి. ఇవి శక్తి వినియోగాన్ని తగ్గించడం, నీటి వృథాను నివారించడం, వ్యర్థాల రీసైక్లింగ్ వంటి చర్యలను అమలు చేస్తుంటాయి. సౌర విద్యుత్, గ్రీన్ ఎనర్జీ వినియోగం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం వంటి విధానాలు వీటి ప్రత్యేకత. కొన్ని హోటళ్లు సేంద్రీయ ఆహారం అందించడం, స్థానిక కళలు, సంస్కృతిని తమ అలంకరణలో ప్రతిబింబించడం ద్వారా స్థిరమైన పర్యాటకానికి మద్దతు ఇస్తున్నాయి. ఇలాంటి వసతి ప్రదేశాల్లో బస చేయడం వల్ల కార్బన్ పాదముద్ర తగ్గడమే కాకుండా పర్యావరణ హిత వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది.
కోల్‌కతా నగరం విస్తృత ప్రజా రవాణా వ్యవస్థకు ప్రసిద్ధి. పసుపు టాక్సీలు, బస్సులు, మెట్రోతో పాటు ఆసియాలోనే పురాతన ట్రామ్ వ్యవస్థ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ట్రామ్‌లో ప్రయాణించడం పర్యాటకులకు ఒక ప్రత్యేక అనుభూతి మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే మార్గం కూడా. తక్కువ దూరాలకు వ్యక్తిగత వాహనాల కంటే నడకను ఎంచుకోవడం మంచిది. మైదాన్, విక్టోరియా మెమోరియల్ పరిసరాలు నడవడానికి అనుకూలంగా ఉండి ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించే అవకాశం కల్పిస్తాయి. ఈ విధంగా ప్రయాణించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు నగరాన్ని నెమ్మదిగా, ఆసక్తిగా అన్వేషించవచ్చు.
కోల్‌కతా చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల కళాకారులకు నిలయం. పర్యాటకులు స్థానిక విక్రేతల నుంచి కొనుగోలు చేయడం ద్వారా పర్యావరణ హిత జీవన విధానాన్ని ప్రోత్సహించవచ్చు. సేంద్రీయ, స్థానికంగా పండే కాలానుగుణ ఆహారాన్ని అందించే రెస్టారెంట్లలో భోజనం చేయడం మంచి ఎంపిక. అనేక హోటళ్లు, భోజనశాలలు వ్యర్థాలను తగ్గించడం, శాఖాహార ఆహారాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. సావనీర్‌ల కోసం దక్షిణాపన్, న్యూ మార్కెట్‌లను సందర్శిస్తే జనపనార, బంకమట్టి, చేతితో తయారు చేసిన పర్యావరణ అనుకూల వస్తువులు లభిస్తాయి. ఇవి జ్ఞాపకంగా నిలవడమే కాకుండా స్థానిక జీవనాధారాలకు తోడ్పడతాయి.
కోల్‌కతాలోని పార్కులు, ఉద్యానవనాలు నగర హడావుడి నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. న్యూ టౌన్‌లోని ఎకో పార్క్, విస్తారమైన మైదాన్, హౌరాలోని ఇండియన్ బొటానిక్ గార్డెన్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా గ్రేట్ బన్యన్ ట్రీ వంటి అరుదైన వృక్షజాలం ఇక్కడి ప్రత్యేకత. ఇక నగరానికి సమీపంలో ఉన్న సుందర్‌బన్స్ పర్యటన పర్యావరణ పర్యాటకానికి అద్భుత ఉదాహరణ. ప్రపంచంలోనే అతిపెద్ద మడ అడవులైన సుందర్‌బన్స్ యునెస్కో వారసత్వ ప్రదేశం. ఇక్కడి పర్యటనలు జీవవైవిధ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తాయి. దుర్గా పూజ వంటి సాంస్కృతిక వేడుకల్లో పాల్గొనడం ద్వారా స్థానిక సంప్రదాయాలను కూడా దగ్గరగా అనుభవించవచ్చు.
Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..!