విజయవాడలోని ప్రముఖ దేవాలయం శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు భారీగా విచ్చేస్తుండటంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా నిబంధనలు తీసుకొచ్చేందుకు దేవస్థానం ఈవో శీనానాయక్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈవో శీనానాయక్ వెల్లడించిన ప్రకారం… ఇకపై సిఫార్సులతో వచ్చే వారు తప్పనిసరిగా లేఖ తీసుకురావాలి. ఆ లేఖలో దర్శనానికి వచ్చే వారి పేర్లు, వివరాలు ఉండాలని, సంబంధిత ప్రజాప్రతినిధి లేదా అధికారుల సంతకం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. టెలిఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా చేసే సిఫార్సులను ఇకపై పరిగణనలోకి తీసుకోరని తెలిపారు.
ప్రజాప్రతినిధులు తమ కుటుంబ సభ్యులతో వస్తే అంతరాలయ దర్శనం కల్పిస్తారు. కానీ ప్రజాప్రతినిధులు లేకుండా కేవలం సిఫార్సు లేఖతో వచ్చే వారు మాత్రం వీఐపీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయమూర్తులకు కూడా కుటుంబంతో వస్తే ప్రోటోకాల్ దర్శనం కల్పిస్తారు. లేఖల ఆధారంగా మాత్రమే దర్శనానికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పేర్కొన్నారు.
ఈ ఏడాది దసరా ఉత్సవాలు సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ పుణ్యకాలంలో దుర్గమ్మను తారకమయ స్వరూపాలలో భక్తులు దర్శించుకోనున్నారు. సెప్టెంబర్ 22న బాలాత్రిపురసుందరీదేవిగా, 23న గాయత్రిదేవిగా, 24న అన్నపూర్ణాదేవిగా, 25న కాత్యాయనిదేవిగా, తదితర స్వరూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. విజయదశమి రోజున మహాపూర్ణాహుతి, సాయంత్రం తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
రాష్ట్రం నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని దేవస్థానం అధికారులు తెలిపారు.