ఆగస్టు 7 రాత్రి నుంచి దేశవ్యాప్తంగా UPI చెల్లింపుల్లో అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా లావాదేవీలు జరగకపోవడంతో లక్షలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫండ్ ట్రాన్స్‌ఫర్, బ్యాలెన్స్ చెక్ వంటి సేవలు సరిగా పని చేయకపోవడంతో Downdetector వంటి అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్లు అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపాయి. అందులో 62% యూజర్లు పేమెంట్ సమస్యలు, 29% ఫండ్ ట్రాన్స్‌ఫర్ లోపాలు, 8% యాప్ గ్లిచెస్ గురించి పేర్కొన్నారు.
ఈ సమస్యపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పందిస్తూ, NPCI సిస్టమ్స్ సక్రమంగా పనిచేస్తున్నాయని, అయితే కొన్ని బ్యాంకుల్లో టెక్నికల్ లోపాల వల్ల UPI కనెక్టివిటీ సమస్యలు వచ్చాయని స్పష్టంచేసింది. బాధ్యత గల బ్యాంకులతో కలిసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇదే సమయంలో, యూజర్లు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తే, మరికొందరు తమ బ్యాంకుల పనితీరుపై విమర్శలు గుప్పించారు.
అదనంగా, ఆగస్టు 1 నుంచి UPIలో కొన్ని కొత్త పరిమితులు అమల్లోకి వచ్చాయి. రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం, ఉదయం 10 గంటల ముందు మరియు రాత్రి 9:30 తర్వాత మాత్రమే బిల్ పేమెంట్ ప్రాసెసింగ్, పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్‌ను రోజులో మూడు సార్లు మాత్రమే చెక్ చేసే పరిమితి వంటి మార్పులు అమలు అయ్యాయి. ఇవి వినియోగదారులపై అదనపు నియంత్రణలు తీసుకొచ్చాయి.