గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే, ఈరోజు మాత్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ రోజు హైదరాబాద్‌లో అతి భారీ వర్షం ఉండకపోవచ్చు, కానీ మోస్తరు వర్షం మాత్రం పడుతుందని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈరోజు ఏపీ, తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక వర్ష హెచ్చరికలు జారీ చేయలేదు.
శానిలైట్ అంచనాల ప్రకారం, తెలంగాణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ బాగా ఉంటుంది. మేఘాలు పెద్దగా కనిపించవు. సాయంత్రం 5 గంటల తర్వాత కర్ణాటక నుంచి కొన్ని మేఘాలు పశ్చిమ తెలంగాణలోకి వస్తాయి.
ఆ తర్వాత వర్షం క్రమంగా పెరుగుతూ రాత్రి 7 గంటల తర్వాత మధ్య తెలంగాణకు కూడా విస్తరిస్తుంది. రాత్రి 8 గంటల తర్వాత హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షం పడుతుంది. ఇది తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తంగా ఈరోజు భారీ వర్షం ఉండకపోయినా, మోస్తరు వర్షం చాలా ప్రాంతాల్లో పడుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పగటివేళ ఎండ బాగా ఉంటుంది. సాయంత్రం తర్వాత అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. ఈరోజు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో వర్షాలు పెద్దగా ఉండవు. కానీ రాయలసీమలో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 3 గంటల వరకు చాలా చోట్ల వర్షాలు పడగలవని అంచనా. ఈరోజు రాయలసీమలో రోజంతా మేఘాలు ఉంటాయి.
ప్రపంచ వాతావరణ పరిస్థితులు చూస్తే, హిందూ మహాసముద్రంలో భూమధ్య రేఖ దగ్గర రెండు పెద్ద సుడిగుండాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఆవర్తనాలుగా మారకపోయినా, గాలిలో కదలికలు అల్లకల్లోలంగా ఉన్నాయి. బంగాళాఖాతంలో కూడా గంటకు 41 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తూర్పు ఆసియాలో 'రగాసా' అనే పేరుతో ఒక తుఫాను ఏర్పడింది.
దాని వేగం గంటకు 110 కిలోమీటర్లు. ఇది మంగళవారానికి చైనా వైపు వెళ్తుంది. ఈ తుఫాను ప్రభావం వల్ల గాలులన్నీ అటువైపు వెళ్తున్నాయి. దీనివల్ల మన తెలుగు రాష్ట్రాలకు కేరళ, కర్ణాటక నుంచి మేఘాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితి దాదాపు 4 రోజులు కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ రోజు వాతావరణం అంతా బాగా ఉన్నప్పటికీ, సాయంత్రం తర్వాత వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల, హైదరాబాద్ ప్రజలు ఎప్పటిలాగే అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, ట్రాఫిక్ జామ్స్‌లో చిక్కుకోకుండా ఉండటానికి సాయంత్రం 5 గంటల లోపు ఇళ్లకు చేరుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. రాత్రి పూట ఎక్కడైనా భారీ వర్షం పడే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఉక్కపోత, వేడి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఉష్ణోగ్రతలు నిన్నటి కంటే ఒక డిగ్రీ పెరిగాయి. మొత్తం మీద, ఈ నెలంతా వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.