సెప్టెంబర్ 16తో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసే గడువు ముగిసింది. ఈసారి 7 కోట్లకు పైగా రిటర్నులు ఫైల్ అయినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఐటీఆర్ ఫైల్ చేసిన వారిలో చాలామంది ఇప్పుడు రీఫండ్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్యాక్స్ విభాగం తీసుకున్న తాజా నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారింది. ముందుగా చిన్న మొత్తాల రీఫండ్లు జారీ చేసి, తర్వాత 50 వేలు దాటిన క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయాలనే ఆలోచనలో ఉంది. దీని వల్ల పెద్ద మొత్తాల రీఫండ్ కోరిన ట్యాక్స్ పేయర్లకు కొంత ఆలస్యం తప్పదని అధికారులు చెబుతున్నారు.
ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం రీఫండ్‌పై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదు. ఎవరు ఎంత మొత్తానికి క్లెయిమ్ చేసినా అది బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఉదాహరణకు రూ.10 వేలైనా, రూ.1 లక్షలైనా రీఫండ్ వస్తుంది. అయితే పెద్ద మొత్తంలో రీఫండ్‌లు కోరిన సందర్భంలో అదనపు తనిఖీలు అవసరం అవుతాయి. పత్రాల్లో ఏవైనా లోపాలు ఉన్నాయా, అధిక క్లెయిమ్ సరైనదా అని ట్యాక్స్ విభాగం ప్రత్యేక పరిశీలన చేస్తుంది. ఈ కారణంగానే పెద్ద మొత్తాల రీఫండ్ ప్రాసెసింగ్ నెమ్మదిగా సాగుతుందని వెల్లడిస్తున్నారు.
ఇక రీఫండ్ వేగంగా రావాలంటే ముందే ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. గడువు వరకు వేచి చూడకుండా ముందుగానే ఫైల్ చేస్తే ఇ-వెరిఫికేషన్ గంటల వ్యవధిలోనే పూర్తవుతుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ కూడా త్వరగా జరుగుతుంది. ఇప్పటికే ముందుగానే ఫైల్ చేసిన చాలామందికి రీఫండ్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొందరికి అయితే అదే రోజు రీఫండ్ కూడా వచ్చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీని వల్ల తొందరగా ఫైల్ చేసే వారికి స్పీడ్‌గా రీఫండ్ వస్తుందని మరోసారి స్పష్టమైంది.
అయితే గడువు రోజున లేదా ఒక రోజు ముందు ఫైల్ చేసిన వారి పరిస్థితి మాత్రం వేరేలా ఉంటుంది. అప్పుడు ఇ-ఫైలింగ్ పోర్టల్‌పై భారీగా లోడ్ పెరుగుతుంది. దీని వలన ఇ-వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి కావడానికి 24–48 గంటల సమయం పడుతుంది. సాధారణంగా ఇ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 2 నుంచి 5 వారాల లోపే రీఫండ్ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అయితే జీతం ఆధారిత ఆదాయం కలిగినవారి సింపుల్ ఐటీఆర్-1 ఫారంలాంటి రిటర్నులు చాలా వేగంగా ప్రాసెస్ అవుతాయి. అందువల్ల రీఫండ్ ఆలస్యం లేకుండా వస్తుంది. మరీ క్లిష్టమైన రిటర్నులు లేదా అధిక మొత్తాల క్లెయిమ్‌లు చేసినవారికి మాత్రం రీఫండ్ రాక కొంత సమయం పడుతుంది.