రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం బ్రేక్‌ఫాస్ట్. రాత్రంతా ఉపవాసం తర్వాత శరీరానికి కావాల్సిన ఎనర్జీని ఇది అందిస్తుంది. అయితే చాలా మంది నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో లేదా టైమ్ లేకపోవడం వంటివి కారణాలుగా చూపుతూ బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేస్తున్నారు. ఇది తాత్కాలికంగా సాధారణంగా అనిపించినా, దీని ప్రభావం శరీరంపై మరియు మానసిక ఆరోగ్యంపై తీవ్రమైనదిగా ఉంటుంది.
బ్రేక్‌ఫాస్ట్‌ను వదిలేయడం వల్ల మెదడుకు అవసరమైన గ్లూకోజ్ సరఫరా తగ్గిపోతుంది. దాంతో ఏకాగ్రత లోపిస్తుంది, పనితీరు తగ్గుతుంది. చదువుతున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు లేదా కష్టమైన పనులు చేసే వారు ఎక్కువగా దాని ప్రభావాన్ని ఎదుర్కొంటారు. తలనొప్పి, అలసట, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇంకా గ్యాప్ ఎక్కువ కావడం వల్ల ఆ తర్వాతి భోజనంలో ఎక్కువగా తినే అలవాటు పెరుగుతుంది. దీని ఫలితంగా బరువు తగ్గకపోవడమే కాకుండా, మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

అలాగే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. బ్లోటింగ్, అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలంగా ఈ అలవాటు కొనసాగితే గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీర మెటబాలిజం అసమతుల్యం కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మారిపోతాయి. ఇది మధుమేహం, హృద్రోగాలు వచ్చే అవకాశాలను పెంచుతుంది.
మాంచెస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక అధ్యయనంలో, బ్రేక్‌ఫాస్ట్ ఆలస్యంగా చేయడం వల్ల కూడా ఆయుష్షుపై ప్రభావం ఉంటుందని తేలింది. వారు వెల్లడించిన వివరాల ప్రకారం, రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ను ఆలస్యం చేసే వారికి ఆయుష్షు 8-10 శాతం వరకు తగ్గే అవకాశముందని చెబుతున్నారు. ఇది శరీర బయోలాజికల్ క్లాక్, హార్మోన్ ఫంక్షన్స్, ఇమ్యూన్ సిస్టమ్ పనితీరుపై ప్రభావం చూపుతుందని వారు వివరించారు.
అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. ఉదయం సులభంగా జీర్ణమయ్యే, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇడ్లీ, దోస, ఉప్మా, పండ్లు, గుడ్లు, ఓట్స్ లాంటి హెల్తీ ఆప్షన్లు శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి. ఇది రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొత్తానికి, ఉదయపు టిఫిన్ కేవలం భోజనం మాత్రమే కాదు, ఆరోగ్యానికి బలమైన పునాది కూడా అని చెప్పవచ్చు.