భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త మోడల్‌ను అందరికంటే ముందుగా కొనుగోలు చేయాలనే ఆత్రుతతో జనం యాపిల్ స్టోర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. ముఖ్యంగా ముంబై బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద పరిస్థితి అదుపు తప్పి తోపులాట జరిగింది. జనం నియంత్రణ తప్పిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరికి కొందరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. ఈ ఘటన యాపిల్ ప్రొడక్ట్స్‌పై దేశంలో ఉన్న క్రేజ్ స్థాయిని మళ్లీ స్పష్టంగా చాటిచెప్పింది.
ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద గురువారం రాత్రి నుంచే వందలాది మంది క్యూల్లో నిలబడ్డారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్ వేరియంట్ విపరీతమైన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక రంగు కోసం అనేక మంది రాత్రంతా నిరీక్షించారు. ముంబైకి చెందిన ఇర్ఫాన్ అనే కొనుగోలుదారుడు మాట్లాడుతూ, “నేను నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ ఆరెంజ్ కలర్ ప్రో మ్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. దీని డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్ అద్భుతంగా ఉన్నాయి” అని ఆనందం వ్యక్తం చేశాడు. మరో కస్టమర్ అమాన్ మీనన్ మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ఈ ఆరెంజ్ కలర్ వేరియంట్ వస్తుందని వింటున్నాను. అప్పటి నుంచి దీని కోసమే ఎదురు చూస్తున్నాను” అని తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు.
ఈసారి యాపిల్ తన ఐఫోన్ 17 బేస్ మోడల్‌లో కూడా ప్రీమియం ఫీచర్లు అందించింది. ఇంతవరకు కేవలం ప్రో సిరీస్‌లో మాత్రమే లభ్యమైన 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఇప్పుడు బేస్ మోడల్‌లోనూ చేరింది. అదనంగా, ప్రారంభ స్టోరేజ్‌ను 256GBకి పెంచింది. ధర విషయానికి వస్తే, గత ఏడాదితో పోలిస్తే బేస్ మోడల్ ధరను కేవలం రూ.3,000 మాత్రమే పెంచింది. అయితే, ప్రో మోడల్ ధర మాత్రం రూ.15,000 అధికమైంది. ఈ మార్పులు యాపిల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
ఐఫోన్ ధరలు ఎంత పెరిగినా, భారతీయులలో ఉన్న యాపిల్ పిచ్చి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది కొత్త సిరీస్ విడుదల సమయంలో స్టోర్ల వద్ద కనిపించే గుంపులు దీన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈసారి కూడా అదే దృశ్యం పునరావృతమైంది. టెక్నాలజీ ప్రియులు కొత్త డిజైన్లు, అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్లు, ఆకర్షణీయమైన కలర్ వేరియంట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడటమే కాకుండా, తోపులాటల దాకా వెళ్లారు. ఈ ట్రెండ్ చూస్తే రాబోయే రోజుల్లో భారతదేశం యాపిల్‌కు మరింత పెద్ద మార్కెట్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.