తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్తగా నియమితులైన జడ్జిలు గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సమక్షంలో జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జస్టిస్ రామకృష్ణా రెడ్డి, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్‌లు విధివిధానాల ప్రకారం ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రాంగణం ఘనంగా మారింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ లాయర్లు, బార్ అసోసియేషన్ సభ్యులు, కుటుంబసభ్యులు హాజరై కొత్తగా బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులను అభినందించారు.
ఇదివరకు లాయర్లుగా సేవలందించిన ఈ నలుగురి పేర్లను జడ్జిలుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28న అధికారిక ఆమోదం ఇచ్చారు.
ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 30కి చేరింది. హైకోర్టు పెండింగ్ కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.