గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హజ్ ఎంబార్కేషన్ పాయింట్‌గా కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 17 అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులకు మాత్రమే ఈ హజ్ ఎంబార్కేషన్ పాయింట్లుగా గుర్తింపు లభించగా.. విజయవాడ విమానాశ్రయం కూడా వాటిలో ఒకటిగా చోటు దక్కించుకుంది.
ఈ నిర్ణయంతో ఏపీ నుంచి హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ప్రయాణ భారం తగ్గుతుందని, సమయం మరియు డబ్బు రెండూ ఆదా అవుతాయని వక్ఫ్ బోర్డు చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్, హజ్ కమిటీ సభ్యులకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పునరుద్ధరణకు కృషి చేసినందుకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
హజ్ ఎంబార్కేషన్ పాయింట్ అంటే హజ్ యాత్ర ప్రారంభానికి అవసరమైన వీసా, పాస్‌పోర్ట్, బ్యాగేజ్, సెక్యూరిటీ తనిఖీలను అక్కడే పూర్తిచేసే ఏర్పాట్లు ఉండే ప్రత్యేక టెర్మినల్. ఈ పాయింట్లు ఉన్న ఎయిర్‌పోర్టుల్లో హజ్ యాత్రికులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించబడతాయి.
భవిష్యత్తులో విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు, హజ్ కమిటీ చైర్మన్ హసన్ బాషా కృషి చేయనున్నారని అధికారులు తెలిపారు.