ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థకు భూముల కేటాయింపు అంశంపై స్పందించింది. పెట్టుబడులు వచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలో తప్పులేదని, అలాంటి కంపెనీల రాకతో రాష్ట్రానికి కలిగే లాభాల దృష్టితో చూస్తే మంచిదని హైకోర్టు స్పష్టం చేసింది.
TCSకి భూమి కేటాయింపు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉందని, ఈ సమయంలో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు కలిగించే సంస్థలు కీలకమని వ్యాఖ్యానించింది.
“ధర ఎంత అనే దానికంటే లాభం ఎంత అన్నదే ముఖ్యం”
ప్రభుత్వం తక్కువ ధరకు భూమి ఇవ్వడం తప్పు కాదని, TCS వంటి సంస్థలు వస్తే భారీగా ఉద్యోగాలు వస్తాయని కోర్టు పేర్కొంది. "హైదరాబాద్, బెంగళూరు ఐటీ రంగంలో ఎలా అభివృద్ధి చెందాయో మనకందరికీ తెలుసు. అలాంటిదే ఇక్కడ జరిగితే మంచిదే" అని హైకోర్టు అభిప్రాయపడింది.
భూమి అమ్మకం కాదు, లీజు: ప్రభుత్వం వివరణ
ప్రభుత్వం తరఫు లాయర్ హైకోర్టులో ఇచ్చిన వివరాల ప్రకారం, విశాఖపట్నంలో 21.16 ఎకరాల భూమిని TCSకి అమ్మడం కాదు, లీజుకు ఇస్తున్నామని తెలిపారు. ఒక్కో ఎకరాకు 99 పైసల చొప్పున ఈ లీజ్ కేటాయింపుపై హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
పిటిషన్ వివరాలు
TCSకు తక్కువ ధరకు భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ‘సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్’ (SPCPER) సంస్థ అధ్యక్షుడు నక్కా నమ్మి పిటిషన్ దాఖలు చేశారు. రూ.529 కోట్ల విలువ ఉన్న భూమిని కేవలం తక్కువ ధరకు సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
తుది తీర్పు వరకు కేటాయింపు అమలుకు బ్రేక్ లేదు
ఈ అంశంపై తుది తీర్పు వచ్చేవరకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని, కేటాయింపులు మాత్రం తుది తీర్పుకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ఉన్నారు.