అమెరికాలో మరో యుద్ధ విమాన ప్రమాదం కలకలం రేపింది. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న ఫ్రెస్నో నగరానికి 64 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు ఉదయం 6:30 సమయంలో ఓ ఎఫ్-35 యుద్ధ విమానం కూలిపోయింది. పైలట్ శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా నేవీ అధికారికంగా వెల్లడించింది.
విమానంలో సమస్య తలెత్తగానే పైలట్ అప్రమత్తమై వెంటనే బయటకి దూకాడని, పారాచూట్ సాయంతో సురక్షితంగా భూమిపై దిగాడని నేవీ తెలిపింది. పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయని, అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.
ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.