తిరుమలలో భక్తుల వసతి ఇబ్బందులను తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి దర్శన టికెట్లతో భక్తులకు వసతి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దర్శన సమయాల్లో మార్పులు చేసింది.
ప్రస్తుతం ఉదయం 10 గంటలకు ఉన్న శ్రీవాణి దర్శనాన్ని ఇకపై సాయంత్రం 4.30 గంటలకు మార్చనున్నట్టు టీటీడీ తెలిపింది. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు అదే రోజు దర్శనం కల్పించనున్నట్టు స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం:
తిరుమలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.
రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి.
తిరుమలలో 800 టికెట్లు, రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో 200 టికెట్లు రోజుకు జారీ చేయనున్నారు.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అక్టోబర్ 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఉదయం 10 గంటల దర్శన సమయమే కొనసాగుతుంది.
నవంబర్ 1 నుంచి అన్ని టికెట్లకు సాయంత్రం 4.30కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద రిపోర్టింగ్ సమయాన్ని అమలు చేయనున్నారు.
టీటీడీ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వలన శ్రీవాణి టికెట్ల కోసం భక్తులు 3 రోజుల పాటు తిరుమలలో ఉండాల్సిన అవసరం లేకుండా, త్వరగా దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఈ విధానం ద్వారా భక్తుల ఖర్చు, సమయం, వసతులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.