ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తోంది. రేషన్ బియ్యం దుర్వినియోగం కాకుండా చూడటం, అలాగే రేషన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు తగ్గించడమే ఈ చర్య వెనుక ఉద్దేశం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పంపిణీ పూర్తవగా, ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 15 వరకు నాలుగు విడతల్లో జిల్లాల వారీగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నారు. ఏటీఎం కార్డు సైజులో ఉండే ఈ కార్డుపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేయగానే రేషన్ తీసుకున్న వివరాలు తేలిపోతాయి.
అయితే, కొత్త కార్డులు అందుకున్న లబ్ధిదారుల్లో కొందరు పాత సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కార్డుల్లో కుటుంబ సభ్యుల బంధుత్వం స్థానంలో “ఇతరులు” అని ముద్రించగా, మరికొన్ని కార్డుల్లో చిరునామా స్థానంలో అర్థంలేని అక్షరాలు వచ్చాయి. ఇంటి యజమాని ఫోటో సరిగ్గా లేకపోవడం, కుటుంబసభ్యుల వివరాలు తప్పుగా ఉండటం, అడ్రస్ మిస్సవడం వంటి సమస్యలు ఉన్నాయని వారు చెబుతున్నారు. కొన్నిచోట్ల మహిళల పేరుతో రావాల్సిన కార్డులు పురుషుల పేరుతో వచ్చాయి. అలాగే ఊరు, మండలం పేర్లలోనూ తప్పులు చోటు చేసుకున్నాయి. దీనితో సంక్షేమ పథకాలకు దూరమవుతామేమోనని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమస్యలపై పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులు ఉంటే సంబంధిత సచివాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రింటింగ్ లోపాలు లేదా వివరాల్లో పొరపాట్లు ఉంటే సచివాలయంలో దరఖాస్తు చేసుకుని సరిదిద్దుకోవచ్చని చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో పంపిణీ జరగగా, మిగిలిన వారికి మరో రెండు విడతల్లో ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.