దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో భారత్‌లో నేరాలకు పాల్పడిన విదేశీయులు ఇకపై దేశంలోకి రావడానికి అవకాశం ఇవ్వకూడదని కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కఠినంగా పాటించాలని ఆదేశించింది.
గూఢచర్యం, ఉగ్రవాదం, హత్యలు, అత్యాచారాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడి దోషులుగా తేలిన విదేశీయులను గుర్తించి, మళ్లీ దేశంలోకి అడుగుపెట్టనీయకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒకవేళ అలాంటి వారు దేశంలో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకోవాలని తెలిపింది. ఇందుకోసం 2025లో అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ చట్టం కింద ప్రత్యేక హోల్డింగ్ సెంటర్లు, నిర్బంధ శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
అదేవిధంగా, సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని, అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి సరిహద్దు రక్షణ దళాలు, కోస్ట్ గార్డులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆఫ్ఘనిస్థాన్, చైనా, పాకిస్థాన్ పౌరులు దేశంలోని సున్నితమైన సరిహద్దు రాష్ట్రాలు—అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది.
అంతేకాకుండా, భారత్‌లో సరైన వీసాతో ఉద్యోగం చేసే విదేశీయులు స్థానిక అధికారుల అనుమతి లేకుండా విద్యుత్, నీరు, పెట్రోలియం వంటి కీలక రంగాల్లోని ప్రైవేట్ సంస్థల్లో చేరరాదని నిబంధన విధించింది. అలాగే, పర్వతారోహణ వంటి కార్యకలాపాల కోసం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.