ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధాని పనులను మళ్లీ ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వేల ఎకరాల భూకేటాయింపులు జరిగి, కీలక భవనాల నిర్మాణ కాంట్రాక్టులు ఇవ్వడం, కొత్త సంస్థలకు ఆహ్వానాలు పంపించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, భూసమీకరణ విషయంలో కొన్ని చోట్ల ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన 52వ సీఆర్డీఏ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని కొద్దిమంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు.
రైతులను ఇబ్బంది పెట్టకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్‌కి రైతులు ముందుకొస్తే స్వాగతిస్తామని చెప్పారు. దాదాపు 1,800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోవడానికి సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇస్తే రైతులకే లాభం ఎక్కువగా ఉంటుందని మంత్రి మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు. భూములు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. మరోవైపు ఏజీసీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం టెండర్లు గెలిచిన సంస్థకు లెటర్ ఆఫ్ అథారిటీ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపారు.