ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ప్రకృతి ఆగ్రహం వీర విరాజిల్లింది. సెప్టెంబర్ 1న సంభవించిన భూకంపం భూభాగాన్ని వణికించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు కనీసం 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 3,100 మందికి పైగా గాయపడ్డారు. ఈ వివరాలను అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించారు.
ఈ ప్రకంపనల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా విస్తృతంగా నష్టం జరిగింది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లోని గ్రామాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. 5,400కి పైగా ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. మట్టి, కలపతో నిర్మించిన ఇళ్లు ఒక్కసారిగా శిథిలాలుగా మారిపోవడంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. చాలామంది నిద్రలో ఉండగానే శిథిలాల కింద చిక్కుకోవడం వల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగింది. భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం పర్వత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రోడ్లు లేకపోవడం, భౌగోళిక ఇబ్బందులు ఉండటంతో రక్షణ బృందాలు గట్టి కష్టాలు ఎదుర్కొంటున్నాయి. గాయపడిన వారిని దవాఖానలకు తరలించడంలో ఆలస్యం అవుతోంది. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, అత్యవసర సహాయం అందించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రజలకు ఆహారం, వైద్యసహాయం, తాత్కాలిక నివాసం అత్యంత అవసరమని, తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.