కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర విద్యా రంగంలో వరుసగా సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ప్రతి జిల్లాలో ప్రత్యేక పరీక్షల బోర్డులు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న డీసీఈబీల స్థానంలో కొత్త బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.
ఈ జిల్లా పరీక్షల బోర్డులకు జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఛైర్మన్‌గా, సార్వత్రిక విద్యా పీఠం సమన్వయ అధికారి కార్యదర్శిగా, ప్రధానోపాధ్యాయులు అకడమిక్ కార్యదర్శులుగా వ్యవహరించనున్నారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగే సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షల ప్రశ్నపత్రాలు జిల్లా బోర్డులే రూపొందిస్తాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మినహా మిగిలిన అన్ని పరీక్షలకు ఇది వర్తిస్తుంది. ఈ ప్రశ్నపత్రాల ప్రమాణాలను ఎస్‌సీఈఆర్టీ (APSCERT) నిర్ధారిస్తుంది.
1969 తర్వాత మొదటిసారిగా ఈ విధంగా ప్రభుత్వ పరీక్షల వ్యవస్థలో మార్పులు చేపడుతున్నారు. అంతేకాదు, రాష్ట్ర పాఠశాల ప్రామాణిక అథారిటీ ఏర్పాటు చేసి, విద్యార్థుల సామర్థ్యాలను కొత్త ప్రమాణాలతో మదింపు చేయనున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల విషయంలో విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో తప్పులు చేసే ఉపాధ్యాయులపై సర్వీసు పాయింట్ల కోత విధించనుంది.
10–20 మార్కుల తేడా వస్తే – 0.5 సర్వీసు పాయింట్లు కోత
20–30 మార్కుల తేడా వస్తే – 1 పాయింటు కోత
30కి పైగా తేడా వస్తే – 2 పాయింట్లు కోత
ఇవి కాకుండా, సర్వీసు పాయింట్ల కోతల కారణంగా దూర ప్రాంతాలకు బదిలీలు, జరిమానాలు, ఇంక్రిమెంట్‌ల రద్దు వంటి చర్యలు కూడా తీసుకోనున్నట్లు విద్యాశాఖ హెచ్చరించింది.