ఏపీ రైతులకు ఆనందకరమైన వార్త! ఎంతకాలంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. పథకం తొలి విడతగా రూ.7 వేల నగదును సీఎం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. మొత్తం 44.75 లక్షల మంది అర్హులైన రైతులకు ఈ సాయం అందిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
మిగిలిన చాలా కొద్ది మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక కారణాల వల్ల డబ్బులు పడలేదని వారు తెలిపారు. వీరిలో ఈకేవైసీ లోపాలు, ఎన్‌పీసీఐ లో ఖాతాలు మ్యాప్ అవ్వకపోవడం, బ్యాంక్ అకౌంట్లు చురుగ్గా లేకపోవడం, పాత పాస్‌బుక్‌లు లేకపోవడం, ఎన్నికల నియమావళి వల్ల నిలిపివేత వంటి సమస్యలున్నాయంటున్నారు. వీటిని రైతులు త్వరగా పరిష్కరించుకుంటే, డబ్బులు ఖాతాల్లోకి వచ్చేస్తాయన్నారు.
అర్హత ఉన్నా నిధులు అందుకోలేకపోయిన రైతులు కంగారు పడాల్సిన పని లేదని, ఆగస్టు 3 నుంచి అభ్యంతరాలు నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామస్థాయి రైతు సేవా కేంద్రాల్లో సవరణల కోసం ఫిర్యాదు చేసుకోవచ్చు.
ఈ పథకం ద్వారా ప్రతి అర్హ రైతుకు ఏడాదికి రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇందులో రూ.6,000 కేంద్ర పీఎం కిసాన్ పథకం నుంచి, మిగిలిన రూ.14,000ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తం ముగ్గురు విడతల్లో రైతులకు చేరుతుంది. మొత్తం మీద ఏటా 46.85 లక్షల మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
సాంకేతిక కారణాలతో నగదు అందని రైతులు వెంటనే సవరణలు చేసుకోవాలని, తర్వాత విడతల్లో నగదు ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.