ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన జాతీయ రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో నదులు, కాలువలు అధికంగా ఉన్న కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని పోర్టుల నిర్మాణం చేయాలని తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండేలా ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మొత్తం 20 కొత్త పోర్టులు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయం వచ్చే నెల ప్రారంభమవుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో చంద్రబాబు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకు కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు గడ్కరీ అందించిన సహాయం అమూల్యమని అన్నారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ తయారీపై కూడా ఆయన ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగర్ మాలా, భారత్ మాలా వంటి పథకాలు దేశం అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను బలోపేతం చేయడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలో 189 కిలోమీటర్ల ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) నిర్మాణానికి కేంద్రాన్ని అభ్యర్థించినట్లు చెప్పారు. అలాగే విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో రైలు సౌకర్యం కల్పించాలన్నదీ తమ డిమాండ్‌గా ఉందన్నారు. కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అత్యుత్తమ రోడ్లు అభివృద్ధి అవుతాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు. హైదరాబాద్ – అమరావతి – చెన్నై – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు ఏర్పాటుకు రైల్వే మంత్రిని కలిసి గతంలో చేసిన ప్రతిపాదనను మళ్లీ గుర్తుచేశారు. నితిన్ గడ్కరీ పర్యటన సందర్భంగా ఈ ప్రతిపాదనను మరోసారి ప్రభుత్వ ముందుంచారని వెల్లడించారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లాజిస్టిక్ హబ్ గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు.