గోదావరిలో బోటు ప్రయాణానికి అలవాటుపడిన తెలుగు ప్రజలకు ఇప్పుడు గంగా నదిపై ప్రయాణించే లగ్జరీ అవకాశమొకటి సిద్ధమవుతోంది. ‘గంగోత్రి’ పేరుతో రూపొందించిన ఈ మూడు అంతస్తుల క్రూయిజ్ షిప్ వారణాసి నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు నదీ మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో భాగంగా పర్యాటకులు గంగా నదిని మరింత సమీపంగా అనుభవించే అరుదైన అవకాశం పొందబోతున్నారు.
గంగోత్రి క్రూయిజ్‌లో 24 ఏసీ గదులు ఉండగా, ఒకేసారి 200 మంది ప్రయాణికులకు వసతి కల్పించగలదు. ఇందులో డైనింగ్ ఏరియా, స్పా, జిమ్, లిఫ్ట్, మీటింగ్ హాల్ వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. గంగా నదిలో ప్రయాణిస్తూ డాల్ఫిన్ల తేలికపాటి కదలికలు, చారిత్రక ఘాట్‌లు, నదీ తీరాల అందాన్ని వీక్షించడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించనుంది. ఇది కేవలం ఓ టూర్ కాదు – పూర్తిగా లగ్జరీ & రిలాక్సేషన్ కలగలిపిన ప్రయాణం.
ఈ క్రూయిజ్ రవిదాస్ ఘాట్ (వారణాసి) నుంచి ప్రారంభమై ఘాజీపూర్, మీర్జాపూర్, చునార్ కోట, వింధ్యాచల్ మీదుగా ప్రయాగ్‌రాజ్ వరకు సాగుతుంది. గంటకు సుమారు 15–20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ షిప్‌కి 3 నుంచి 6 రోజుల టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం టూరిజం శాఖ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ లగ్జరీ క్రూయిజ్ కేవలం విహారం మాత్రమే కాదు – ఒక కల్చరల్ యాత్రగా కూడా రూపుదిద్దుకుంది. ఇందులో భక్తి సంగీత కార్యక్రమాలు, యోగా సెషన్లు, గైడెడ్ ఘాట్ టూర్లు నిర్వహించబడతాయి. బనారసి స్టైల్ వంటకాల రుచి, వారణాసి సంస్కృతి, గంగా ఆధ్యాత్మికత అన్నీ ఈ క్రూయిజ్‌లో కలుసుకుంటాయి. రిలాక్సేషన్, కల్చరల్ ఎక్స్‌ప్లోరేషన్ కోరుకునే పర్యాటకులకు ఇది ఓ ఉత్తమ ఎంపిక అవుతుంది.