రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ (ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు 200 రెట్లు దరఖాస్తులు వచ్చినప్పుడే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఉదాహరణకి, ఏదైనా నోటిఫికేషన్‌లో 100 పోస్టులు ఉంటే, దానికి 20,000 దరఖాస్తులు వచ్చినప్పుడే ప్రిలిమ్స్ ఉంటుంది. లేదంటే, ప్రత్యక్షంగా మెయిన్స్ పరీక్షకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం అయితే, పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా 25,000 దరఖాస్తులు దాటితే ప్రిలిమ్స్ నిర్వహించే విధానం కొనసాగుతోంది. అయితే ఇది సమయం, ఖర్చు పరంగా కష్టతరంగా మారిందని ఏపీపీఎస్సీ అభిప్రాయపడింది. అందుకే దరఖాస్తుల సంఖ్య 200 రెట్లు దాటినప్పుడు మాత్రమే ఫిల్టర్ చేసేందుకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రభుత్వం ఆమోదించినట్లయితే చాలా ఉద్యోగాలకు కేవలం ఒక్క దశ పరీక్ష ద్వారానే నియామకం జరగనుంది.