ఓటర్ ఐడీ కార్డు కేవలం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మాత్రమే కాకుండా, అనేక ప్రభుత్వ, ఆర్థిక లావాదేవీలలో గుర్తింపు పత్రంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి ప్రధాన వివరాలు ఉంటాయి. కానీ దరఖాస్తు లేదా జారీ సమయంలో జరిగిన పొరపాట్ల వల్ల పేరు తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మీరు ఆన్‌లైన్‌లోనే సులభంగా పేరును సరిచేసుకోవచ్చు.
దీనికి ఫారం 8 ఉపయోగించాలి. ఇది ఓటర్ జాబితాలోని మీ వివరాలు సవరించేందుకు, నివాస మార్పు లేదా వయస్సు, ఫోటో, ఇతర వివరాలు సరిచేయడానికి ఉపయోగించే అధికారిక దరఖాస్తు ఫారం. ఈ ఫారం నింపడానికి ఎన్నికల సంఘం పోర్టల్ https://voters.eci.gov.in/ ను సందర్శించాలి.
ఓటర్ ఐడీలో పేరు మార్పు కోసం ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ (https://voters.eci.gov.in/) ను సందర్శించాలి. అక్కడ ఓటర్ ఐడీకి లింక్ అయిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, వచ్చిన OTP ద్వారా ధృవీకరించాలి. లాగిన్ అయిన తర్వాత ఓటర్ ఐడీ నంబర్‌ను ఎంటర్ చేయాలి. వివరాలు స్క్రీన్‌పై కనిపించిన వెంటనే Correction Entry ఆప్షన్‌ను ఎంచుకుని, ఫారం 8లో పేరు మార్పుతో పాటు అవసరమైన సవరణలను నమోదు చేయాలి. తర్వాత ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, విద్యుత్ లేదా గ్యాస్ బిల్లు, 10వ లేదా ఇంటర్ మెమో వంటి పత్రాల్లో ఏదైనా ఒకటి అప్‌లోడ్ చేయాలి. అన్ని వివరాలు, పత్రాలు సరిచూసుకున్న తర్వాత Submit బటన్‌పై క్లిక్ చేయాలి. సమర్పణ పూర్తయిన వెంటనే రిఫరెన్స్ నంబర్ వస్తుంది, దీని ద్వారా దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా ట్రాక్ చేసుకోవచ్చు.