రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్‌కోర్టుల్లో ఆహార నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కితే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఘాటుగా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రత ప్రభుత్వానికి అగ్ర ప్రాధాన్యం అని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని మంత్రి వెల్లడించారు. పరిశీలించిన 51 హోటళ్లు, రెస్టారెంట్లలో 44 చోట్ల ఆహార నాణ్యతా నిబంధనలు బహిరంగంగా ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. పాడైన ఆహారం వడ్డించడం, పరిశుభ్రతా లోపాలు, హానికరమైన కలరింగ్ పదార్థాల వినియోగం వంటి తీవ్రమైన లోపాలను గుర్తించి, వాటిపై చర్యలకు అవసరమైన ఆధారాలు సేకరించినట్లు వివరించారు.
"కొంతమంది హోటల్ నిర్వాహకులు నాసిరకం, హానికరమైన పదార్థాలను వంటకాలలో కలిపి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. దీని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ముదురుతున్నాయి" అని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం సమీక్ష జరిపిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల దళాలు మరింత చురుగ్గా పని చేస్తాయని, చట్టం ముందు పెద్దా చిన్నా తేడా లేకుండా ఉల్లంఘనకారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, ప్రజలు కూడా బయట భోజనం చేసేప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నాణ్యతపై అనుమానం కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.