వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, బెదిరింపులు, ఘర్షణల వాతావరణం పులివెందులలో నెలకొన్న పరిస్థితులు చూసి, తన తండ్రి వైఎస్ వివేకా జయంతికి రావడానికే సునీత భయపడుతున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆరోపించారు.
గత మూడు రోజులుగా జరుగుతున్న దాడులు వైసీపీనే నిర్వహించి, వాటి నెపాన్ని తెలుగుదేశంపై మోపుతున్నారని సునీత ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఇది పులివెందులలో వైసీపీ నేతల ప్రవర్తన ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
“వైసీపీ నేతలకు పులివెందులలో ఓటమి భయం పట్టేసింది. అందుకే ధర్నాలు, పోలీసులను బెదిరించడం, డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తాం.
‘జగన్ రప్పా.. రప్పా’ అంటూ అసభ్య పదజాలం ఉపయోగించడం, వైసీపీ నేతల ప్రవర్తనను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల ప్రభావంతో, ఏడాదికి పైగా పులివెందులలో నెలకొన్న ప్రశాంతతతో, ఇక్కడి రెండు స్థానాలు తెలుగుదేశం గెలుస్తుందనే నమ్మకం ఉంది” అని ధీమా వ్యక్తం చేశారు.