సూర్యుని నుంచి వెలువడే శక్తివంతమైన ప్లాస్మా అలలు భూమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. సూర్యుడు ప్రస్తుతం తన 11 ఏళ్ల సౌర చక్రంలో అత్యంత పీక్ దశ అయిన సోలార్ maximum ఉండటంతో, కరోనల్ మాస్ ఎజెక్షన్ (CME)లు మరింత వేగంగా, శక్తివంతంగా భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొట్టే ప్రమాదం ఉంది. దీని వల్ల జియోమాగ్నెటిక్ తుపానులు ఏర్పడి, విద్యుత్ గ్రిడ్‌లు, మొబైల్, కంప్యూటర్లు, GPS, ఉపగ్రహ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సేవలు వంటి సాంకేతిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సముద్రం దిగువనున్న ఇంటర్నెట్ కేబుళ్లకు నష్టం జరిగితే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు నిలిచిపోవచ్చు.
గతంలో కూడా అమెరికా, యూరప్ వంటి ప్రాంతాల్లో సౌర తుపానుల కారణంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయి. 2024 మేలో జరిగిన G5 స్థాయి తుపాను గత 20 ఏళ్లలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తింపు పొందింది. ఈసారి 2025లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. NASA, ESA, ISRO వంటి అంతరిక్ష సంస్థలు సూర్యుని కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ తుపానులు ప్రమాదకరమైనప్పటికీ, భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద ఆకర్షణీయమైన ఆరోరా కాంతుల ప్రదర్శనలు కూడా కనిపించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పరిశోధనా సంస్థలు ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు వివిధ చర్యలు చేపడుతున్నాయి. విద్యుత్ గ్రిడ్‌ల భద్రతను పెంచడం, ఉపగ్రహ వ్యవస్థలను బలోపేతం చేయడం, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను రక్షించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ తుపానుల తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇంకా కష్టమే. అందువల్ల 2025 సౌర తుపాను సాంకేతిక మౌలిక సదుపాయాల భద్రతకు ఒక పెద్ద పరీక్షగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.