రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్ (India) పై భారీగా సుంకాల భారాన్ని మోపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump). దీనికి భారత్ కూడా దీటుగా స్పందిస్తూ.. దేశంలోని రైతుల ప్రయోజనాలే ముఖ్యమని పేర్కొంది. ఈ క్రమంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు (US Tariffs).
ట్రంప్ విధించిన సుంకాల భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. టారిఫ్ల వివాదం పరిష్కారం అయ్యేవరకు న్యూదిల్లీతో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవని ఓవల్ కార్యాలయంలో ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్ అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్ స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి ప్రతిస్పందనగానే ట్రంప్ నేరుగా చర్యలు తీసుకున్నారన్నారు.
రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికలను పట్టించుకోని భారత్ పై ట్రంప్ భారీగా సుంకాలు విధించారు. ఇప్పటికే 25% సుంకాలను విధించిన ఆయన.. దానిని 50 శాతానికి పెంచారు. పెంచిన 25శాతం సుంకాలు ఈనెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ట్రంప్ టారిఫ్లకు భారత్ కూడా దీటుగా స్పందించింది. దేశంలోని రైతులు, మత్య్సకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అవసరమైతే ఆ భారాన్ని తామే మోస్తామన్నారు.