రష్యాలోని తూర్పు ప్రాంతం కమ్చట్కా ద్వీపకల్పం మళ్లీ బలమైన భూకంపం ప్రభావానికి గురైంది. గురువారం (సెప్టెంబర్ 18) అర్ధరాత్రి తర్వాత 7.8 తీవ్రతతో భూకంపం సంభవించగా, అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పెట్రోపావ్లోవ్స్‌క్-కామ్చట్‌స్కీ ప్రాంతాన్ని కుదిపేసిన ఈ ప్రకంపనలు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. భూకంపం సంభవించిన క్షణాల్లోనే భవనాలు, ఫర్నిచర్, రోడ్లపై పార్క్ చేసిన వాహనాలు, వీధి లైట్లు బలంగా కంపించాయి. ఆ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, అవి వేగంగా వైరల్ అవుతున్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, భూకంపం కేంద్రం భూమి ఉపరితలానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు వెల్లడించింది.
తాజా భూకంపానికి అనుబంధంగా రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రతతో పలు ఆఫ్టర్‌షాక్స్ నమోదయ్యాయి. ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. అయినప్పటికీ, తూర్పు తీర ప్రాంతమంతా అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ స్పష్టం చేశారు. టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు సమాచారం చేరుస్తూ, రాబోయే గంటల్లో సునామీ ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. స్థానిక నివాసితులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సునామీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంకా బయటపడకపోయినా, అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా కమ్చట్కా ద్వీపకల్పంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. సెప్టెంబర్ 13న 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, అప్పటికీ అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సెప్టెంబర్ 15న 6.0 తీవ్రతతో మరో భూకంపం చోటు చేసుకుంది. దీనికి ముందు జూలైలోనూ ఈ ప్రాంతం బలమైన ప్రకంపనలతో వణికింది. ముఖ్యంగా జూలై 30న నమోదైన 8.8 తీవ్రత భూకంపం, జూలై 20న సంభవించిన 7.4 తీవ్రత ప్రకంపనలు రష్యా ప్రజల్లో భయాందోళనలను పెంచాయి. తరచూ ఇంత భారీ స్థాయిలో భూకంపాలు రావడం వల్ల ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకర భూకంప ప్రదేశంగా భావించబడుతోంది.
భూకంపాల పరంపర కొనసాగుతుండటంతో కమ్చట్కా ప్రాంతంలో ప్రజలు భయం, ఆందోళనతో రోజువారీ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇళ్లలోనే ఉన్నప్పటికీ ఎప్పుడైనా మళ్లీ ప్రకంపనలు సంభవిస్తాయేమో అన్న అనుమానం వారిని వెంటాడుతోంది. శాస్త్రవేత్తల ప్రకారం, ఈ ప్రాంతం భూకంప రేఖలపై ఉండటం వల్ల తరచూ ఇలాంటి ప్రకంపనలు జరుగుతుంటాయని చెబుతున్నారు. అయినప్పటికీ, వరుస భూకంపాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుంటోంది. రక్షణ బృందాలను అప్రమత్తంగా ఉంచి, సునామీ ముప్పు ఎదురైనా తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. మొత్తంగా, ఈ నెలలోనే మూడోసారి భారీ భూకంపం సంభవించడం రష్యా ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది.