రష్యా తూర్పు ప్రాంతం కమ్చట్కా ద్వీపకల్పం భారీ భూకంపంతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం స్థానిక ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించింది. భూకంపం సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ప్రభావం మరింతగా కనిపించింది. వెంటనే అధికారులు తీర ప్రాంతాలపై సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ ఘటన పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. భూకంప తీవ్రతకు ఇళ్లలోని ఫర్నిచర్ ఊగిపోగా, రోడ్లపై నిలిపిన వాహనాలు కూడా కంపించాయి. సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వేగంగా వైరల్ అవుతున్నాయి.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప తీవ్రత 7.8గా నమోదయినప్పటికీ, రష్యా భూభౌతిక విభాగం మాత్రం 7.4గా నమోదు చేసిందని తెలిపింది. అంతేకాక, భూకంపం తర్వాత ఐదు సార్లు స్వల్ప కంపనలు నమోదయ్యాయి. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తీర ప్రాంతాల్లో ప్రమాదకర అలలు తాకే అవకాశం ఉందని హెచ్చరించింది.
కమ్చట్కా గవర్నర్ వ్లాదిమిర్ సోలోడోవ్ స్పందిస్తూ, ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. అయితే జాగ్రత్త చర్యగా తూర్పు తీరప్రాంతాలకు సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ ప్రాంతం పసిఫిక్ మహాసముద్రంలోని "రింగ్ ఆఫ్ ఫైర్" టెక్టోనిక్ బెల్ట్‌లో భాగమైందికావడంతో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత జూలైలో కూడా 8.8 తీవ్రతతో భూకంపం సంభవించి, సునామీ కారణంగా ఒక గ్రామం సముద్రంలో కలిసిపోయిన ఘటన గుర్తుండే ఉంది. ఈసారి కూడా ప్రజలు భయాందోళనకు గురవుతున్నప్పటికీ, అధికారులు అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు.