ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంస్థ BONbLOC టెక్నాలజీస్ లిమిటెడ్ గన్నవరంలోని ఐటీ టవర్స్‌లో తన అత్యాధునిక హబ్‌ను ప్రారంభించింది. అమరావతిని ఐటీ హబ్‌గా మార్చాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ సంస్థ రాష్ట్రంలో అడుగుపెట్టింది.
దేశంలో తన సేవలను విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా BONbLOC, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా స్పాట్ బస్ IoT డివైజ్‌లను ఆర్టీసీ బస్సులలో అమర్చనుంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందించనున్న నేపథ్యంలో, బస్సులకు అవసరమైన ఈ అధునాతన పరికరాలను BONbLOC అందించనుంది.
BONbLOC సీఈఓ సౌరి గోవింద రాజన్ వివరాల ప్రకారం, ఈ స్పాట్ బస్ IoT డివైజ్‌లు విజయవాడ, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోని APSRTC బస్సులలో అమర్చబడతాయి. ఈ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ వేర్వేరు ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు.