గుంటూరులో జరిగిన 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశపు పవర్‌ఫుల్ మిసైల్ ప్రధాని నరేంద్ర మోదీ అని లోకేశ్ కొనియాడారు. గత ఐదేళ్ల వైకాపా చీకటి పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన ఆరోపించారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు.
మరోవైపు, ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, వారికి స్వీట్లు పంపిణీ చేశారు.
అలాగే, రాష్ట్రంలోని వివిధ పార్టీల కార్యాలయాల్లోనూ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ చీఫ్ షర్మిల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రమంతటా రాజకీయ ప్రముఖులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.