ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయుల హాజరు విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్తున్నట్టు హాజరు నమోదు చేసుకొని, సొంత పనుల కోసం బయటి ప్రాంతాలకు వెళ్ళి డ్యుటీ చేయడం లేదంటూ వచ్చిన నేపథ్యంలో, విద్యాశాఖ ఈ విధానంలో మార్పులు చేసింది.

ఇకపై, ఉపాధ్యాయులు స్కూల్ పనికి బయలుదేరేముందు లీన్ యాప్ (LEAP – Learning Excellence in Andhra Pradesh) ద్వారా స్పెషల్ డ్యూటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీడీవో దరఖాస్తులను పరిశీలించి, ఉపాధ్యాయుడు ఎక్కడికి వెళ్ళినారో GPS ఆధారంగా, అక్షాంశాలు, రేఖాంశాలతో సహా నిర్ధారిస్తారు. వివరాలు సరిపోతే OTP ద్వారా స్పెషల్ డ్యూటీకి అనుమతిస్తారు, లేకపోతే గైర్హాజరు నమోదు అవుతుంది.
విశేషంగా, ఉపాధ్యాయుడు ప్రత్యేక పనికి వెళ్ళిన సందర్భంలో, సంబంధిత అధికారికి డీడీవో ఫోన్ ద్వారా వెంటనే సమాచారం అందుతుంది. ఈ విధానం వల్ల పాఠశాలల్లో బోధన మరియు విద్యా కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నారు.
ఉత్తమ అధ్యాపక అవార్డుల మార్పులు:
ఉన్నత విద్యాశాఖ రాష్ట్రంలో ఉత్తమ అధ్యాపక అవార్డుల మార్గదర్శకాలను సవరించింది. కొత్త నామినేషన్ విధానం ప్రకారం, ప్రతీ అవార్డు కోసం మూడు రెగ్యులర్ అధ్యాపకులను ప్రతిపాదించవచ్చు. మొత్తం 1,000 మార్కులలో బోధన, ఇతర కార్యకలాపాలకు 800 మార్కులు, ఇంటర్వ్యూకు 200 మార్కులు కేటాయించారు. విశ్వవిద్యాలయాల కమిటీకి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ అధ్యక్షుడిగా ఉంటారు. జేఎన్‌టియు (అనంతపురం) మరియు ఆదికవి నన్నయ వీసీలు సభ్యులుగా, కళాశాల అధ్యాపకుల కమిటీలో కళాశాల విద్యా డైరెక్టర్, డైరెక్టరేట్ జేడీ తదితరులు ఉంటారు.