ప్రకాశం జిల్లా, పెద్దదోర్నాల మండలం శ్రీశైలం సమీపంలోని చిన్నారుట్ల చెంచుగూడెంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని ఒక చిరుతపులి నోట కరుచుకుని లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. తల్లిదండ్రులు, గ్రామస్థులు చూపిన ధైర్యసాహసాల వల్ల ఆ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే, ఈ దాడిలో పాపకు తీవ్ర గాయాలయ్యాయి.
బుధవారం రాత్రి, కుడుముల అంజయ్య, లింగేశ్వరి దంపతులు తమ కుమార్తె అంజమ్మతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడిన చిరుతపులి పక్కనే పడుకున్న చిన్నారి అంజమ్మను నోటితో పట్టుకుని బయటకు లాక్కెళ్లింది. చిన్నారి అరుపులు విని ఉలిక్కిపడిన తల్లిదండ్రులు, వెంటనే తేరుకుని కర్రలతో చిరుతను వెంబడించారు. వారి అరుపులకు చుట్టుపక్కలవారు కూడా మేల్కొని సహాయానికి వచ్చారు. ప్రజలను చూసి భయపడిన చిరుతపులి, పాపను పొదల్లో వదిలేసి అడవిలోకి పారిపోయింది.
ఈ దాడిలో చిన్నారి తల, పొట్ట భాగాల్లో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం దోర్నాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎస్ఐ మహేశ్, సంఘటన స్థలాన్ని పరిశీలించి, పాప కుటుంబసభ్యులను పరామర్శించారు.
గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గూడెం వాసులు దోర్నాల-శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. దీనితో ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ, పోలీస్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. గ్రామానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో భయాందోళనలను సృష్టించింది. వన్యప్రాణుల దాడుల నుంచి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.