
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.
“2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ను నాశనం చేసింది. వ్యవస్థను నిర్వీర్యం చేసింది. దీంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయింది. రూ.10 లక్షల కోట్ల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చలేదు.
తవ్వినకొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, అక్రమాలు, అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అవరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీయే నినాదాన్ని ప్రజలు నమ్మి చరిత్రాత్మక తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు.
94 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్ షేర్తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేం అధికారాన్ని చేపట్టిన ఏడాదిలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా పని చేశాం. తొలి సంతకం నుంచి సుపరిపాలన వైపు అడుగు వేశాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం.
నేను ఈరోజు సవినయంగా, సగర్వంగా చెబుతున్నా కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు.. అభివృద్ధికి అడ్డు లేదు.. సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డు.. ఇదే ఆల్టైమ్ రికార్డు అని మరోసారి చెబుతున్నా. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం..
బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం వాటిల్లదు..
'అడవితల్లి బాటలో' ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తున్నాం. ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. రాయలసీమను సస్యశ్యామలం చేయాలని నిర్ణయించాం. గోదావరి వృథా జలాలను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలి.
సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వినియోగిస్తాం. బనకచర్లతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకూ నష్టం వాటిల్లదు. దీనికి ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లాను కరవు నుంచి బయటపడేసే వెలుగొండకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జులై నాటికి సాగునీరు ఇచ్చేలా ప్రాజెక్టు పనులు చేస్తున్నాం.
మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగించాం. రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు నిర్వహించాం. 113 ప్రాజెక్టులకు సంబంధించి రూ.5.94 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించాం. వీటి ద్వారా 5.56 లక్షల ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం.
ఇప్పటివరకు 1.5 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక అందించాం. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మద్యం పాలసీ రూపొందించాం. నాణ్యమైన, బ్రాండెడ్ మద్యం విక్రయాలు జరిగేలా చూస్తున్నాం. ప్రజా పాలనలో సాంకేతికతను విస్తృతం చేశాం. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 700 పౌర సేవలు అందిస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మనది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ" అని చంద్రబాబు తెలిపారు.