హెచ్ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) 2050 నాటికి మెట్రో పరిధిలో సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ - 2050ను రూపొందిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల నుంచి 11 జిల్లాల వరకూ విస్తరించిన హెచ్ఎండీఏ, కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ) మరియు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వైటీడీఏ)లను కూడా ఇందులో కలుపనుంది. ఈ ప్రణాళికలో ప్రధానంగా మూడు విభాగాలపై కసరత్తు జరుగుతోంది – ప్రజా రవాణా కోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్, ఆర్థిక అభివృద్ధికి ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్, నీటి వనరులు, పచ్చదన అభివృద్ధికి బ్లూ & గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్.
ఈ మూడూ ప్లాన్లు ఈ ఆగస్టు చివరి నాటికి సిద్ధమవుతాయని అధికారులు తెలిపారు. మొబిలిటీ ప్రణాళికను నేషనల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ పాలసీ 2006/2014కు అనుగుణంగా రూపొందిస్తున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్-10 నగరాల్లో చేర్చాలన్న లక్ష్యంతో ఎకనామిక్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందిస్తున్నారు. మొత్తం 11,328 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఒకే బేస్ రూపొందించనున్నారు. ఇందులో అన్ని రకాల భౌగోళిక, వాస్తవిక డేటాను జియో బేస్డ్ మ్యాపింగ్ ద్వారా పొందుపరుస్తారు. బేస్ మ్యాప్ తయారీకి 12 నెలల సమయం పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు కూడా పిలవనున్నారు.