పాకిస్థాన్‌ను వరుస భూకంపాలు భయపెడుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే రెండోసారి భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శనివారం అర్ధరాత్రి 12:10 గంటల సమయంలో ఉత్తర పాకిస్థాన్‌లో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు అనేక నగరాల్లో బలమైన ప్రకంపనలు వచ్చాయి. నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పాకిస్థాన్ వాతావరణ శాఖలోని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ (NSMC) ప్రకారం, ఈ భూకంపం రావల్పిండికి సమీపంలో ఉన్న రావత్ పట్టణానికి ఆగ్నేయంగా 15 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూమి ఉపరితలం నుంచి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవించడంతో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇస్లామాబాద్, రావల్పిండితో పాటు అటక్, స్వాబి, స్వాత్, ముర్రీ, జీలం, మలకంద్, మన్సెహ్రా, అలాగే ఆజాద్ జమ్మూకశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది.
గత 24 గంటల్లో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం. శుక్రవారం కూడా ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో కేంద్రీకృతమైన 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. దాని ప్రభావం కూడా పాకిస్థాన్‌పై కనిపించింది. అయితే, ఈ తాజా భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. హిందూకుష్ పర్వత ప్రాంతాల్లోని టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.