అమెరికాలో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ మెక్డొనాల్డ్స్,( McDonald's) భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో నగరంలో రూ.875 కోట్లు (అంటే సుమారు 100 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాలని సంస్థ నిర్ణయించింది.
మెక్డొనాల్డ్స్ గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హెడ్ దేశాంత్ కైలా అందించిన సమాచారం ప్రకారం, వచ్చే రెండేళ్లలో ఈ భారీ పెట్టుబడి Hyderabadలోనే వెచ్చించనున్నారు. ఇది సంస్థకు గ్లోబల్ స్థాయిలో కీలక కేంద్రంగా మారేందుకు దోహదపడుతుందని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో గ్లోబల్ ఆఫీస్‌ను మెక్డొనాల్డ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం ఆ కార్యాలయంలో సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్య 500కి పెరిగే అవకాశం ఉంది. ఇక 2027 ప్రారంభానికి ఈ సంఖ్య 2,000కి చేరుతుందని అంచనా.
ఈ పెట్టుబడి ద్వారా Hyderabadలో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశముండటంతోపాటు, సాంకేతిక సేవల్లో మెరుగుదల జరగనుంది. ముఖ్యంగా డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా ఎనలిటిక్స్, టెక్నాలజీ మద్దతు వంటి విభాగాల్లో కంపెనీ మరింతగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది.
ఈ ప్రాజెక్ట్ నగరానికి నేరుగా లాభాలను తెచ్చిపెట్టనుందని, మెక్డొనాల్డ్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలకు కూడా ప్రేరణ కలిగించవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.