గోవా ప్రభుత్వం రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను మరింత శుభ్రంగా, సురక్షితంగా ఉంచేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల అసెంబ్లీలో ఆమోదించబడిన ఈ బిల్లు ప్రకారం, ప్రజలను ఇబ్బంది పెట్టే, అసభ్యంగా ప్రవర్తించే చర్యలను “న్యూసెన్స్”గా పరిగణించి, కనీసం ₹5,000 నుండి గరిష్ఠంగా ₹1,00,000 వరకు జరిమానాలు విధించనున్నారు. గోవా ప్రధానంగా పర్యాటక రాష్ట్రంగా పేరుగాంచిన నేపధ్యంలో, అక్కడి బీచ్‌లు, పబ్లిక్ ప్రదేశాల్లో జరుగుతున్న అనాచార చర్యలు సర్వసాధారణంగా మారుతున్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించడం ప్రారంభించింది.
ఈ న్యూసెన్స్‌గా పరిగణించబడే చర్యలలో పర్యాటక ప్రాంతాల్లో వస్తువులు కొనమని బలవంతంగా ఒత్తిడి చేయడం, అనధికారికంగా మద్యం సేవించడం, బీచ్‌లపై వంటలు చేయడం, మద్యం సీసాలు పగలగొట్టడం, చెత్త వేయడం, బిక్షాటన చేయడం, బీచ్‌లపై వాహనాలు నడపడం వంటి వాటి చేర్చారు. ఇవి పర్యాటకుల అనుభవాన్ని బాగా ప్రభావితం చేయడమే కాకుండా, స్థానికులకు కూడా తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఈ చట్టం అమలుకు సంబంధించి అధికారులకు మరిన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. వాళ్లే జరిమానాలు విధించవచ్చు, అవసరమైతే తప్పు చేసిన వారి వస్తువులను స్వాధీనం చేసుకునే హక్కు కూడా ఉంటుంది. ఇది పర్యాటక ప్రాంతాల్లో క్రమశిక్షణను తీసుకురావడంలో కీలకంగా మారనుంది. ఇకపై గోవాలో తిరిగే పర్యాటకులు, స్థానికులు అందరూ ఈ నిబంధనలను గౌరవించాలి, లేకపోతే తీవ్ర జరిమానాలు తప్పవన్నది స్పష్టంగా తెలియజేస్తోంది గోవా ప్రభుత్వం.
ఈ నిర్ణయంతో గోవా మరింత శుభ్రంగా, ప్రశాంతంగా మారి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు ఆదర్శ గమ్యంగా నిలవనుంది. పర్యాటక రంగాన్ని పరిరక్షించడంలో ఇది ఓ మంచి ముందడుగు అనే అభిప్రాయాన్ని పర్యాటక రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.