తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రేషన్ కార్డుల పంపిణీపై నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం చివరికి మంజూరు చేస్తోంది. సామాన్యులకు ఇది శుభవార్తే అనాలి.
సీఎం వెల్లడించిన ప్రకారం, ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకూ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరగనుంది. అన్ని మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్డుల ద్వారా పేదలకు సన్న బియ్యం ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలకు ఉపశమనం లభించనుంది.
అలాగే వర్షాకాలం నేపథ్యంలో అత్యవసర ఖర్చులకు ప్రతి జిల్లాకు రూ. 1 కోటి నిధులను విడుదల చేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ సేవలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే వారు లోకల్‌గా తిరగాలి అని సూచించారు. వర్షాలతో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇక చివరిగా, ఎరువుల కొరత అనేది కృత్రిమంగా సృష్టించబడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎరువుల లభ్యతపై ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినప్పటికీ, అధికారులు రైతులకు అవి సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాపుల దగ్గర స్టాక్ బోర్డులు ఏర్పాటు చేసి పారదర్శకత చూపాలని చెప్పారు. అధికారుల ధ్యేయం ప్రజల సేవ కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.