రైలు ప్రయాణికులకు శుభవార్త. విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యం కోసం, అలాగే ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అనుసరించి రైలు నంబర్ 12795/96 విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వతంగా అదనపు కోచ్‌లు పెంచినట్లు విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయం వెల్లడించింది. అదనపు బోగీలు ఏర్పాటు ద్వారా మరిన్ని సీట్లు, సౌకర్యవంతమైన, సుఖవంతమైన ప్రయాణానికి వీలు కలుగుతుందని తెలిపింది.
12795 నంబర్ విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక త్రీ ఏసీ ఎకానమి కోచ్ అమర్చనున్నారు. 12796 నంబర్ లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక త్రీఏసీ ఎకానమీ కోచ్ అమర్చనున్నారు. జూలై 26, జూలై 27 తేదీల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయం వెల్లడించింది. మరోవైపు విజయవాడ - లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణలోని లింగంపల్లి మధ్య ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. 2018లో వీటిని ప్రవేశపెట్టారు. ఏపీ రాజధాని ప్రాంతం - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రైళ్లు సౌకర్యంగా ఉంటాయి.
విజయవాడ - లింగంపల్లి- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 336 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 5 గంటల 55 నిమిషాలలో చేరుకుంటాయి. లింగంపల్లి నుంచి ప్రతిరోజూ ఉదయం 4:40 నిమిషాలకు లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12796) రైలు బయల్దేరుతుంది. ఉదయం 10:35 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. త్రీ ఎకానమీ, చైర్ కార్, సెకండ్ సీటర్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి. బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, గుంటూరు జంక్షన్, మంగళగిరి లో ఈ రైలుకు స్టాపింగ్ ఉంది.
విజయవాడ - లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12795) విజయవాడ జంక్షన్ నుంచి సాయంత్రం 5:30 నిమిషాలకు ప్రతిరోజూ బయల్దేరుతుంది. రాత్రి 11:30 నిమిషాలకు లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ రైలు టికెట్ ధరలు తరగతి ఆధారంగా ₹150 నుంచి ₹535 వరకూ ఉన్నాయి. అయితే ఈ రైలుకు వస్తున్న ఆదరణ, ప్రయాణికుల డిమాండ్ ఆధారంగా అదనంగా త్రీఏసీ ఎకానమీ కోచ్‌లు అదనంగా ఏర్పాటు చేయనున్నారు.