కొచ్చి నుంచి ముంబైకి బయలుదేరిన ఎయిరిండియా విమానం (ఏఐ-2744) ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై నుంచి అదుపుతప్పింది. భారీ వర్షం కారణంగా రన్‌వేపై జారిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో విమానానికి స్వల్ప నష్టం వాటిల్లినప్పటికీ, విమానంలో ఉన్న ప్రయాణికులు మరియు సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమాన ఇంజిన్, మూడు టైర్లు దెబ్బతిన్నాయి. రన్‌వే కొంతమేర దెబ్బతినడంతో, ఇతర విమానాల ల్యాండింగ్ కోసం ద్వితీయ రన్‌వే 14/32ను వినియోగిస్తున్నారు.
ఈ సంఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు, అయితే వేగంగా స్పందించిన విమానాశ్రయ అత్యవసర బృందాలు ప్రయాణికులను సురక్షితంగా విమానం నుంచి దించివేశాయి. భారీ వర్షం మరియు టైర్లు పేలిపోవడం వంటివి ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు పునరుద్ఘాటించారు.