ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు మళ్లీ ఊపందుకున్నాయి. తాజాగా గృహనిర్మాణ శాఖ మంత్రి నారాయణ అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన ఆయన, పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా రెండో దశ భూసమీకరణపై త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రెండో దశ భూసమీకరణ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘానికి తీసుకెళ్లి చర్చించి తుదినిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గత కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించిన విషయం గుర్తుచేశారు. మరో ఒకటి రెండు రోజుల్లో ఉపసంఘం సమావేశం నిర్వహించి తుది అంగీకారం తీసుకొని తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కోసం ఉంచుతామని తెలిపారు.
రాజధానిలో జరుగుతున్న హౌసింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి వివరించారు. ఇప్పటికే 12 టవర్ల నిర్మాణం వేగంగా కొనసాగుతోందని, ఇందులో 288 క్వార్టర్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పారు. అలాగే మంత్రులు, న్యాయమూర్తుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న క్వార్టర్లు కూడా వచ్చే మార్చి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు మౌలిక వసతుల పనులు మరింత వేగం పెరుగుతాయని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిపాలనకు మరింత ప్రభావవంతమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.