వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు విజయం అందించారని తెలిపారు. 2019లో 151 స్థానాలు గెలవడంతో జగన్ ప్రభుత్వానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో అని తీవ్ర హెచ్చరిక ఇచ్చారు.
ఈ రోజు పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామంలో పెందుర్తి ఇన్‌చార్జ్ గండి బాబ్జి ఆధ్వర్యంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం, సుపరిపాలనలో ముందడుగు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలన ఎలా ఉంది..? సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేదా..? అని మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం ’సుపరిపాలనలో ముందడుగు’ అని ఉద్ఘాటించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన పనిచేస్తోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే ప్రజల కోసం పని చేస్తామని.. ప్రతిపక్షంలో ఉంటే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి పోరాడుతామని పేర్కొన్నారు. 2019 తర్వాత తెలుగుదేశం చాలా ఇబ్బందులకు గురైందని చెప్పారు.
ఒక సమయంలో తెలుగుదేశం ఏమవుతుందోనని ఆవేదన చెందానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ లాగా గాలికి పుట్టలేదని.. ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ ఇదని ఉద్ఘాటించారు. 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే.. ఇతర రాష్ట్రాల వారు భయపడే పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు మంత్రి అచ్చెన్నాయుడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్‌పై ఉన్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించామని నొక్కిచెప్పారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారని ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు మూడు వాయిదాల్లో రూ. 20000లు ఇస్తున్నామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.