జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలన్న డిమాండ్‌తో ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున కదిలాయి. రాజ్యసభలోని 63 మంది ప్రతిపక్ష ఎంపీలు ఆయనను తొలగించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియ జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఇటీవల ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో నోట్ల కట్టలు బయటపడటంతో ఈ వివాదం చుట్టూ కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్సభలోనూ చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తం 145 మంది ఎంపీలు కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మెమోరండం సమర్పించారు. వీరంతా జస్టిస్ వర్మను తొలగించాలన్న అభిశంసన తీర్మానానికి సంతకం చేశారు.
ఈ అభిశంసన తీర్మానంపై భారతీయ జనతా పార్టీకి చెందిన రవిశంకర్ ప్రసాద్, అనురాగ్ ఠాకూర్ కూడా సంతకం చేయడం గమనార్హం. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీకి చెందిన సుప్రియా సూలే కూడా ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించారు.
ఈ అభియాన్‌కు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, జనసేన సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడం రాజకీయంగా విస్తృత మద్దతును సూచిస్తోంది. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలన్న లక్ష్యంతోనే తీసుకున్న చర్యలుగా ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.