విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం ఏపీఎంఆర్‌సీ ఇటీవల బందరు రోడ్, ఏలూరు రోడ్ కారిడార్‌ల పనుల కోసం టెండర్లు పిలిచింది. అసలు ఈ టెండర్లు సెప్టెంబర్ 18న తెరవాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్లతో నిర్వహించిన ప్రీబిడ్ మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన సూచనలు రావడంతో, టెండర్ల గడువును అక్టోబర్ 14 వరకు పొడిగించాలని ఏపీఎంఆర్‌సీ నిర్ణయించింది.
ఈ ప్రీబిడ్ మీటింగ్‌లో అనేక కాంట్రాక్టు సంస్థలు పాల్గొన్నాయి. వాటిలో చాలామంది ఒకే గుత్తగా కాకుండా పనులను విభజించి టెండర్లు పిలిస్తే మంచిదని సూచించారు. దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టుల్లో కూడా ఈ విధానం పాటించారని, అలా చేస్తే చిన్న చిన్న కంపెనీలు కూడా అవకాశం పొందుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు కొన్ని సంస్థలు సింగిల్ కాకుండా జాయింట్ వెంచర్ (భాగస్వామ్యం)కు కూడా అవకాశం ఇవ్వాలని కోరాయి.
ఈ సూచనలపై ఏపీఎంఆర్‌సీ ఎండీ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, గతంలో పనులను విభజించి టెండర్లు ఇచ్చిన చోట్ల ఎక్కువ జాప్యం జరిగిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ల సూచనలను బోర్డు మీటింగ్‌లో చర్చించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్టుకు ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు రాలేదు. ఇప్పటికే ప్రతిపాదన పంపించగా, దాని ఆధారంగా ట్రాఫిక్ స్టడీ కూడా పూర్తయింది. అయితే అనుమతులు లభించకపోవడంతో, పనులు మొదలయ్యే విషయంలో ఆలస్యం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లోనే ఏపీఎంఆర్‌సీ ముందస్తుగానే టెండర్లు పిలిచింది.
విజయవాడలోని మెట్రో ప్రాజెక్టుతో పాటు, 45 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన కూడా ఉంది. దీని వ్యయం రూ.1,800 కోట్లుగా అంచనా వేసి, డీపీఆర్ కేంద్రానికి పంపారు. ఈ ఫ్లైఓవర్, మెట్రో రైల్ అనుమతులు ఒకేసారి వచ్చే అవకాశమున్నప్పటికీ, ఇంకా తుది నిర్ణయం రాలేదు. అందువల్ల, ప్రాజెక్టు పనులు ప్రారంభం కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.