ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక సౌకర్యం అందించేందుకు ముందుకొచ్చింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అక్టోబర్ 2 నుంచి ఇంటికే పంపే విధానం ప్రారంభించనుంది. ఈ నిర్ణయంతో విద్య, ఉద్యోగాలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాల కోసం అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం సులభంగా అందుబాటులోకి రానుంది.
ఈ సేవలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభమైంది. వీఆర్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఆధార్, రైస్ కార్డు, విద్యార్హతలు, గతంలో పొందిన ధ్రువపత్రాలు వంటి వివరాలను సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలు తహసీల్దార్ కార్యాలయం వరకు చేరి, వెబ్‌ల్యాండ్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవసరమైతే ఆర్డీవో, జేసీల స్థాయిలో కూడా పరిశీలన జరుగుతుంది.
అభ్యర్థుల అర్హతలు ఖరారైన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను నేరుగా ప్రజల ఇళ్లకే పంపిస్తారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద లంచాలు, వేచివుండే సమయానికి పూర్తిగా చెక్ పడనుంది. ప్రజలు ఎప్పుడైనా తమ పత్రాలను ప్రభుత్వ వెబ్‌సైట్ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నారు.