మన ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ప్రతి నెలా అవసరాన్ని బట్టి బుక్ చేసుకుంటాం. కానీ చాలామందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గ్యాస్ సిలిండర్‌కి కూడా టెస్ట్ డ్యూ డేట్ అనే ఒక గడువు ఉంటుంది. ఈ తేదీని గమనించడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే టెస్ట్ డ్యూ డేట్ అనేది ఆ సిలిండర్ చివరిసారిగా ఎప్పుడు సురక్షితంగా టెస్ట్ చేయబడిందో తెలియజేస్తుంది.
సిలిండర్ పైభాగంలో హ్యాండిల్ దగ్గర ఒక ప్రత్యేక కోడ్ ఉంటుంది. ఇందులో ఆంగ్ల అక్షరాలు (A, B, C, D) మరియు సంఖ్యలు ఉంటాయి. ప్రతి అక్షరం మూడు నెలలను సూచిస్తుంది. ఉదాహరణకు – A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి. B అంటే ఏప్రిల్, మే, జూన్. C అంటే జులై, ఆగస్టు, సెప్టెంబర్. D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అక్షరంతో పాటు ఉన్న సంఖ్య ఆ సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు “A24” అంటే 2024 జనవరి–మార్చి మధ్య సిలిండర్ టెస్ట్ పూర్తయిందని అర్థం.
ప్రస్తుతం ఒక సిలిండర్‌పై “A26” అని రాసి ఉంటే, అది 2026 జనవరి నుండి మార్చి మధ్యలో టెస్ట్ డ్యూ డేట్ ముగుస్తుందని అర్థం. కాబట్టి ప్రతి సారి సిలిండర్ తీసుకునే సమయంలో ఈ కోడ్‌ను తప్పక గమనించాలి. డ్యూ డేట్ ముగిసిన సిలిండర్లను ఖాళీగా ఇచ్చినప్పుడు, గ్యాస్ కంపెనీలు వాటిని మళ్లీ టెస్ట్ చేసి సురక్షితమని నిర్ధారిస్తాయి.
టెస్ట్ పూర్తి అయిన తర్వాత సిలిండర్ సురక్షితంగా ఉందని తేలితే దానికి కొత్తగా పెయింట్ వేసి మరో డ్యూ డేట్ పెడతారు. ఒకవేళ పనికిరాదని తేలితే ఆ సిలిండర్‌ను వాడకం నుండి తప్పిస్తారు. గ్యాస్ కంపెనీలు తెలిపిన ప్రకారం, టెస్ట్ డ్యూ డేట్ ముగిసిన వెంటనే ప్రమాదాలు జరగవు. అయితే సురక్షితంగా ఉండేందుకు ప్రతి రీఫిల్ సమయంలో ఈ టెస్టింగ్ ప్రక్రియను తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఈ విధానం వల్ల వినియోగదారులు మరింత భద్రంగా సిలిండర్లను ఉపయోగించగలుగుతున్నారు.