తెలంగాణలోని ఉత్తర జిల్లాలను హైదరాబాద్‌తో కలిపే ముఖ్యమైన రహదారి రాజీవ్ రహదారి. మూడున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రహదారి, దశాబ్దం క్రితం నాలుగు లైన్ల స్టేట్ హైవేగా మారింది. అయితే పెరుగుతున్న ట్రాఫిక్, తరచూ జరిగే ప్రమాదాల కారణంగా ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఆధునిక 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవేగా మార్చాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రూ.400 కోట్ల వ్యయం అవుతుంది.

ప్రస్తుతం ఉన్న రహదారి నాలుగు లైన్లకే పరిమితం కావడంతో వాహనాల రద్దీ పెరుగుతోంది. ముఖ్యంగా మలుపుల వద్ద ఎదురెదురుగా వాహనాలు ఢీకొనడం, డివైడర్ తక్కువ ఎత్తులో ఉండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ రహదారిలోనే మొత్తం ప్రమాదాల 40 శాతం చోటు చేసుకుంటున్నాయి. గతంలో గజ్వేల్, తిమ్మారెడ్డిపల్లి, గౌరారం ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో భయం కలిగించాయి.
ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త రూపకల్పనను చేపడుతోంది. మలుపులు పూర్తిగా తొలగించి, అవసరమైతే భూసేకరణ చేసి, కొత్త మార్గాన్ని ఊర్ల బయటుగా నిర్మించాలని నిర్ణయించారు. దీంతో గ్రామాల మధ్యగా వెళ్లే ప్రస్తుత రహదారి భారం తగ్గి, సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అదనంగా డివైడర్ ఎత్తు, వెడల్పును పెంచి రోడ్డు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
ఈ రహదారి శామీర్‌పేట నుంచి మంచిర్యాల వరకు 205 కిలోమీటర్ల పొడవున ఉంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట నుంచి ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, కరీంనగర్, సుల్తానాబాద్, పెద్దపల్లి, బసంత్ నగర్, గోదావరిఖని మీదుగా మంచిర్యాల సమీపంలోని జైపూర్ క్రాస్ వరకు ఈ మార్గం విస్తరించి ఉంది. దీంతో హైదరాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాలకు నేరుగా అనుసంధానం ఏర్పడింది.
అయితే గతంలో శాసనమండలి బృందం రెండు సార్లు పరిశీలించినప్పటికీ, నిర్మాణ లోపాలు సరిచేయకపోవడం వల్ల పరిస్థితి విషమించిందని నిపుణులు చెబుతున్నారు. ఈసారి ప్రభుత్వం తీసుకున్న 8 లైన్ల ఎక్స్‌ప్రెస్ హైవే నిర్ణయం వల్ల రోడ్డు సురక్షితంగా మారి, ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.