రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్-డి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా ప్రకటన ప్రకారం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నవంబర్ 17 నుంచి డిసెంబర్ చివరి వరకు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. ఈ పరీక్షల ద్వారా మొత్తం 32,438 లెవల్-1 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు స్పష్టం చేసింది.
ఇప్పటికే ఈ నియామకాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదల చేయనుంది. పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.
అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆర్‌ఆర్‌బీ సూచించింది. దేశవ్యాప్తంగా లక్షలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల కావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది.